Bhairav

 


ఇది 2009 లో జరిగిన యదార్థ సంఘటన.

వివరంగా చెప్పాలంటే బోల్డన్ని పేజీలవుతాయి.

మా దగ్గర ఒక కుక్క పిల్ల ఉండేది . భైరవ్ దాని పేరు. మా ఆవిడకు కుక్కలన్నా పిల్లులన్నా పడేది కాదు . నాకు మా పిల్లలకు మాత్రం కుక్క పిల్ల అంటే భలే సరదా. ఎప్పుడు పెంచుకుందామనుకున్నా మా ఆవిడ పడనిచ్చేది కాదు. కొంత మెలోడ్రామాటిక్ మలుపులు జరిగాక మొత్తానికి మా ఇంటికి 45 రోజుల కుక్క పిల్లని తెచ్చుకోగలిగాం.

మిగతా విషయాలన్నీ పక్కన పెడితే, ఒక రోజు భైరవ్ మా ఇంటినించి తప్పించుకొని పోయింది. అప్పుడు

దాని వయసు ఒక సంవత్సరం ఉండొచ్చు. చిన్న కుక్క పిల్ల, మేడలో బెల్టు తో లబ్రడోర్ ఎంతో ముద్దుగా ఉండేది అందరం దానిని వొదిలి వుండే వాళ్ళం కాదు. భార్య భర్తలం ఇద్దరం ఉద్యోగులం పిల్లలిద్దరూ స్కూల్ కాలేజీ లైనా ఎవరో ఒకరు తొందరగా రావడమో లేదా ఎగ్గొట్టటమో చేసేవాళ్ళం . ఇంటికి వొచ్చేసరికి మీద పడి ఛంపేసేది. ఆ పాటికి భైరవ్ మా ఇంట్లో నే కాదు పక్కింట్లో, ఎదురింట్లో, పేపర్ వాడికి, పాల వాడికి, మా ఇంటి గుండా వేళ్ళ స్కూల్ పిల్లలకి, అందరికి పరిచయం అయిపోయింది . మా బంధువులైతే మా కోసం తక్కువ దానికోసం ఎక్కువ వోచేవాళ్ళు .

ఇక విషయానికి వొస్తే, ఉదయాన్నే భైరవ్ కనపడలేదు అన్నవిషయం తెలియంగానే అందరం ఉరుకుల పరుగుల మీద వెతకడానికి బయల్దేరాం తలా ఒక వైపు . ఒక గంట అయ్యేసరికి మా బంధువులు స్నేహితులు పొరుగు వాళ్ళు అందరు వెతకటం మొదలెట్టాం. ఫోన్లలో అందరు వాళ్ళవాళ్ళ స్నేహితులకు అందరికి భైరవ్ ఆచూకీ ఎమన్నా దొరుకుతుందేమో అని కనుక్కోవడం మొదలు పెట్టారు. మధ్యాన్నం వరకు ఏమి ఆచూకీ తెలియలేదు. చుట్టుపక్కల వీధులు అన్ని వెతికాం అన్ని చోట్ల వాకబు చేసాం కానీ ఎక్కడ మాకు భైరవ్ జాడ తెలియలేదు . మా ఆవిడా పిల్లలైతే ఒకటే ఏడుపులు నాకైతే ఒక రకమైన భాద విచారం దిగులు అన్నీను .

మళ్లీ స్కూటర్ వెస్కొని బయల్దేరాను ఇంట్లో ఉండలేక. మా ఇంటి దగ్గరలో ఒక పార్క్ ఉంది అక్కడ వాకబు చేయడం మొదెలెట్టాను . పార్క్ మొదట్లో ఒక చిన్న బల్ల మీద స్ప్రౌట్స్ అమ్మే ఒక అతనిని అడిగాను భైరవ్ గురించి వివరిస్తూ. అనూహ్యంగా అతను చెప్పిన విషయం మాకు కొంత ఆశ కలిగించింది. ఆసమయంలో మాకు అతడు దేవుడిలా అనిపించాడు. ఉదయాన ఎవరో ఇద్దరు పిల్లలు ఒక కుక్కపిల్లను మోటార్ సైకిల్ మీద పెట్టుకొని హడావడిగా వెళ్లడం గమనించాడంట. ఎలా తోచిందో కానీ అతనికి ఆ మోటార్ సైకిల్ నెంబర్ నోట్ చేసుకున్నాడు, అతని అరచేయి మీద. మోటార్ సైకిల్ హోండా లాగా అనిపించింది అని చెప్పాడు. సుమారు మధ్యాన్నం 2 గంటలకు దొరికిన విషయం ఇది. నిజానికి ఆ చిన్ని ప్రాణం ఎమన్నా తినిందో లేదో ఎలా ఉందొ అని ఒకటే ఆలోచనలు.

ఆ చిన్న క్లూ తీస్కొని, పక్కా సినిమాలాగే, బృందాలుగా విడిపోయి వెతకటం మొదలు పెట్టాం. ఎక్కడ ఆ మోటార్ సైకిల్ గురించి కానీ భైరవ్ గురించి కానీ సమాచారం దొరకలేదు. నిరాశ, నిస్పృహ, అలసట, నీరసం అన్ని ముంచుకొచ్చాయి. ప్రతి గల్లీ దగ్గర భైరవ్, భైరవ్ అని అరుచుకుంటూ తిరగటం ఎక్కడన్నా మా అరుపు విని తిరిగి మొరుగుతుందేమో అని ఆశగా ఎదురు చూడడం కానీ ఎక్కడ మాకు భైరవ్ జాడ కనిపించలేదు రాత్రి 7 వరకు తిరిగి తిరిగి వొచ్చేసాం.

తర్వాతి రోజు, మరుసటి రోజు కూడా అందరం వెతకటం మానలేదు. మెల్ల మెల్లగ అందరు వాళ్ళ వాళ్ళ పనులు చేస్కుంటూ అప్పుడప్పుడు ఎమన్నా జాడ తెలిసిందా అని కనుక్కునే వారు.

మూడోరోజు దొరికిన క్లూ తో RTA ఆఫీస్ కి వెళ్లి ఆ మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ వివరాలను ఓనర్ అడ్రస్తో సహా సంపాదించాను. సినిమా కథకు తక్కువ కాకుండా ఓనర్ అడ్రస్ ఎక్కడో LB నగర్ లో తేలింది . తీరా అక్కడ ఆ అడ్రస్ లో అలాంటి వ్యక్తి ఎవరు లేరు అని తేలింది. కథ మొదటికి వొచ్చింది అన్నట్టయింది మా పరిస్థితి . ఏమాత్రం సినిమా కథకు తీసిపోనివిధంగా అనిపించింది మాకు .

-ఆ నంబర్తో హోండా మోటార్ సైకిల్ ఉండడం మాత్రం కరెక్ట్

-అది ఆచుట్టుపట్ల తిరగడం మాత్రం కరెక్ట్

-అది కొని ఇంకా ఒక సంవత్సరం కూడా కాలేదు

ఈ విషయం అర్థం అయ్యాక మళ్ళి మొదలెట్టాం మా గాలింపు. ఆ మోటార్ సైకిల్ అక్కడక్కడే తిరుగుతూ ఉండిఉంటే ఇంకా ఒక సంవత్సరం కూడా కాకుండా ఉంది కాబట్టి ఫ్రీ సర్వీసింగ్ లు కంపెనీ షో రూమ్ లలో చేయించుకునే అవకాశం ఉండొచ్చు అని అలోచించి , జంట నగరాల్లో ఎన్ని హోండా మోటోరీ సైకిల్ షో రూమ్ లు ఉన్నాయో అని వెతికితే 15 షో రూమ్ లు ఉన్నాయని తేలింది.

ఇంకో రెండు రోజుల యాతన తర్వాత 12 వ షో రూమ్, మా ఇంటికి దగ్గర్లోనే ఉంది దానిలో రెండు నేనలా క్రితం సర్వీసింగ్ చేయించ బడింది అని తేలింది. కానీ, అడ్రస్ సరిగా లేదు, ఫోన్ నెంబర్ కూడా లేదు. మళ్లీ మొదటికొచ్చాము.

భైరవ్ గురించిన ఆలోచనలు దిగులు అన్ని నన్ను ఈ విషయాన్నీ ఇంతటితో వొదిలిపెట్టనియ్యలేదు . ఇంతా కష్టపడ్డాక ఇంక వెనుతిరిగేదే లేదు అని ఫిక్స్ ఐపోయాను.

ఇంకొకసారి వివరాలు తిరగేస్తే మోటార్ సైకిల్ ఫైనాన్స్ లో కొన్న విషయం గుర్తుకొచ్చింది . వెంటనే ఆ ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళాం వివరాలకోసం. అంత సులభంగా ఇవ్వలేదు, ఎదో పోలీస్ కేసు అని చెప్పవలసి వొచ్చింది కానీ ఆ లోన్ అకౌంట్ వివరాలన్నీ ఆ మధ్యనే రీజినల్ ఆఫీస్ చెన్నైకి పంపారని ఇక్కడ ఏమి ఉండవని చెప్పారు. ఆఫలాన చెన్నై రీజినల్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్లు గాత్ర చేసి ఫేస్ లో వాళ్ళ లోకల్ ఆఫీస్ కి ఆ లోన్ అప్లికేషన్ డాకుమెంట్స్ అన్ని తెప్పిచుకున్నాం.

లోన్ అప్లికేషన్ లో అడ్రస్ ఫేక్, గారంటీ ఇచ్చిన వాళ్ళ అడ్రస్ ఫేక్ , ఫోన్ నంబర్లన్నీ ఫేక్ అని తేలింది. మేము ఒక అడుగు ముందుకెళ్తే రెండడుగులు వెనక్కు తోస్తోంది పరిస్థితి. ఒక స్టేజి లో ఇదేదో టెర్రరిస్ట్ నేటివర్కులోకి వెళ్లేలాగుందని కొంత భయం కూడా వేసింది,

ఇన్ని అవాంతరాలు వొచ్చినా వెనక్కుఐతే తగ్గ తలుచుకోలేదు. ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ మాత్రం కచ్చితంగా నెల నెల జమ అవుతున్నాయి అని తెలిసింది . వెంటనే బ్యాంకు వివరాలు కనుక్కున్నాం. అదృష్టవశాత్తు ఆ బ్యాంకు లో మా కంపెనీ అకౌంట్స్ కూడా ఉన్నాయ్. అతని అడ్రస్ అన్ని దొరికాయి.

అతనొక చిరుద్యోగి మొదట నాకే కుక్కపిల్ల తెలియదు అని బుకాయించిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఎదో కుక్కపిల్లని తెచ్చాడు అని ఒప్పుకొని ఫోన్ చేసి వాడిని ఆ కుక్కపిల్లని తెప్పించాడు అతని ఆఫీస్ దగ్గిరికి. వాళ్లిద్దరూ అక్కడికి వొచినంతవరకు నాకు ఊపిరి ఆడలేదు ఒకటే ఆదుర్దా. ఎట్టకేలకు మా భైరవ్ వొచ్చింది . రాంగానే నా దగ్గరికి చాలా దిగులుగా వొచ్చింది ఏమాత్రం చలాకి తనం లేకుండా. దానికి కూడా ఇంతవరకు దిగులుగానే ఉండిఉండాలి అనుకున్నాను. ఆ సమయం లో నా లోని భావాలూ ఆలోచనలు వివరించనలవి గాకుండా ఉన్నాయ్. దాన్ని అలానే కొంతసేపు ఎత్తుకున్నాక, ఆ పిల్ల వాడిని తిట్టాలనుకున్నవాడిని ఒక 500 రూపాయలు డబ్బు ఇచ్చి థాంక్స్ అని చెప్పి ఇంటికెళ్ళాను. అప్పటికే మా చిన్నవాడు జ్వరం తో రెండు రోజులనించి బాధ పడుతున్నాడు. భైరవ్ ని చూడగానే అన్ని మాయం అయిపోయాయి వాడికి. బంధు మిత్రులందరూ ఇంటికి వొచ్చారు స్వీట్స్ మరియు భైరవ్ కి బిస్కోట్లు తీస్కొని వొచ్చారు.

మొత్తానికి సాధించాము, ఎన్నో మలుపులు, అవాంతరాలు, డెడ్ ఎండ్స్ వొచ్చినాకూడా వొదిలిపెట్టకుండా ప్రయత్నించిన దానికి ఒక గొప్ప సంతృప్తి.

ఈ పరిశోధన తర్వాత నాకు ఆత్మవిశ్వాసం తో పాటు, పట్టుదలతో ఏదైనా సాధించగలం అన్న నమ్మకం పెరిగింది.

నేను పైన వివరించిన ప్రతి ఒక్క విషయం యదార్థం ఏమాత్రం కల్పితం కాదు.

12 సంవత్సరాల క్రితం జరిగినా మా అందరి జ్ఞాపకాల లో పదిలంగా ఉంది ఈ సంఘటన. ఈ సంఘటన గుర్తు ఉండటంకోసం వ్రాసుకొని పెట్టుకున్నా కూడా కానీ ఇప్పుడు ఈ ప్రశ్నకు నా సమాధానం సరిపోతుందనిపించి ఇక్కడ వ్రాయటం జరిగింది.

2020 లో భైరవ్ చనిపోయింది కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల.


Comments

Popular posts from this blog

🚘 The Road Beckons — A Note Before the Journey

Dream Ignites - Solo Road Trip to Leh

🌤️ Day 2 — Nagpur to Sagar