Covid effect - First Solo Trip

 


సోలో ఎస్కేప్ (తెలుగులో ఏమనాలో తెలియట్లేదు)

ఆ మధ్యన కరోనా ఎంత దెబ్బకొట్టిందో తెలుసు కదా. దాదాపు రెండేళ్లు స్నేహితులు లేదు, బంధువులు లేదు, షాపింగ్ లేదు, సినిమాలు లేవు. వేరియంట్ల మీద వేరియంట్లు టెంట్లేస్కోని కూర్చున్నాయి. అవే ముఖాలు, అవే గోడలు. కొంత తగ్గాక కూడా ఎక్కడికెళ్ళాలన్నా భయం, ఇంట్లో ఒక్కరికి భయమేసినా ఎవ్వరు వెళ్ళడానికి లేదు. నువ్వంటించుకొని వొచ్చి మాకు కూడా తగిలిస్తావ్ టాట్ ఎక్కడికి వెళ్లడానికిలేదు కూచో. వాళ్ళు రారు మనలని పోనియ్యరు, అది దుస్థితి.

పోయిన డిసెంబర్ (2021) లో బరితెగించి చెప్పేశా ఇంట్లో, నేను పారిపోతున్నా అని. మరీ ఆలా కాకున్నా ఇంచుమించు అలానే. వారం రోజులు సోలో ఎస్కేప్ అని, 29 వ తారీకు న చెప్పి, 30 న నా MG హెక్టర్ కార్ లో, ఒక్కడినే వెళ్తున్నా అని చెప్పేశా. ఇక్కడికొద్దు అక్కడికి, అదొద్దు ఇది, ఈ హోటల్ బాలేదు, ఇటొద్దు అటు తిప్పు, లే కూచో అనే వాళ్లెవరు లేకుండా బిందాస్.

ఎక్కడా హోటల్ రిజర్వేషన్ చేయించుకోకుండా, ఎక్కడపడితే అక్కడ బస చేసేలా,ఎక్కడా హైవే లో వెళ్లకుండా (ఆలా వెళ్తే మజా ఏముంటుంది వొట్టి రోడ్ తప్ప జనాలు, జనావాసాలు, జంతు జాలం, పల్లెలు, పల్లెవాసులు, ఊసులు, వగైరా ఉండవుకదా) గూగుల్ లో చూసుకుంటూ చిన్న చిన్న దారులలోనే పోదలుచుకున్నా. ఎంతలా ప్రిపేర్ అయ్యానంటే వెస్ట్రన్ కమోడ్లు ఉంటాయోలేదో అని కొన్ని రోజులు రహస్యంగా బస్కీలు ప్రాక్టీస్ చేశా. ఒక మడత దోమతెర, రెండు దుప్పట్లు, 25 బిస్కట్ ప్యాకెట్లు, 10 వాటర్ బాటిళ్లు, 10 చాకోలెట్ ప్యాకెట్లు తీస్కొని చెలో నా సా..మీ రంగా.. అని 30 ఉదయము 6 గంటలకు బైల్దేరా, నా సోలో ఎస్కేప్ ట్రిప్ కి.

ఇంట్లో వాళ్ళకి, ఆఫీస్ లో వాళ్ళకి చెప్పా అర్జెంటు ఐతే తప్ప ఫోన్లు చెయ్యొద్దు నేనే అప్పుడప్పుడు చేస్తా అని.

ఎక్కడికో ఇంట్లోకూడా చెప్పలేదు. ఎస్కేప్ కదా. ఎక్కడెక్కడికెళ్లాలో ముందే ఏమి ప్లాన్ కూడా చేసుకోలేదు కానీ కోనసీమ, ఆంధ్ర అంతా చుట్టేద్దామా లేదా కర్ణాటకనా అనుకున్నా. కర్ణాటక వైపు మొగ్గింది త్రాసు.

ఆరేడు రోజుల ప్రయాణం అనుకున్న. ప్రతి రోజు సాయంత్రం 4 గం వరకు నింపాదిగా, విలాసంగా డ్రైవ్ చేస్కుంటూ, అక్కడక్కడా జనాలతో గప్పాలు కొడుతూ, టీ బిస్కట్లు ఆస్వాదిస్తూ 4 గం ప్రాంతంలో వొచ్చే ఊరులో ఆగి. ఎదో ఒక హోటల్ లో బస చేసి. ఒక గంట రెస్ట్ తీస్కొని. కారు అక్కడే ఉంచి. ఒక రిక్షానో లేదా ఆటోరిక్షానో ఆ ఊరంతా తిప్పి రాత్రి భోజనం చేయించేసి మళ్ళి హోటల్ లో దింపే ప్రాతిపదికన మాట్లాడుకునేట్టు ప్లాన్. సూ...పె..రే..హా, కదా

ముందు హైదరాబాద్ నించి కర్నూల్ కి వెళ్ళా (మా ఊరు కదా! ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి, ఐనా చదువు, సంధ్య, అల్లరి, చిల్లర, బాల్యం, యవ్వనం, కౌమారం దాక అన్ని అక్కడే జరిగి పొయ్యాయి మరి). అక్కడే సుబ్బరంగా కారం దోస, వడ లాగించేసి, పాత జ్ఞాపలకను గుర్తు చేసే గేరి (వీధి నే మేము గేరి అనేవాళ్ళంలెండి) లన్ని తిరిగి, 11 గం బళ్లారి వైపు బైల్దేరా.

అలా అలా 3 గం కల్లా బళ్లారి చేరిపోయి అల్లుమ్ హోటల్లో దిగిపొయ్యా. అనుకున్నట్టే ఆటో మాట్లాడుకొని బలాదూరుగా బళ్లారి ఐపోగాట్టా. ఫుడ్డు బాలే!

పొద్దున్నే హంపి కి పరిగెత్తించా. ఎప్పుడో చూసాను కానీ, ఇప్పుడు, ఇలా, ఒక గైడ్ ని పెట్టుకొని చూడడం మాత్రం అద్భుతం. చెప్పలేనంత ఆనందం. ఫ్రీడమ్ కూడా ఉంది కదా ఆడెడ్ ఫ్లేవర్ మరి.

బొజ్జ నిండా తిండి తిని, మెల్లగా బయల్దేరి సాయంత్రానికి రాయదుర్గం గుండా చిత్రదుర్గ చేరాను. హోటల్ గ్రాండ్ సెంట్రలంట, సులభంగానే గది దొరికింది. ఒక ఆటో, లోకల్ తిరుగుడు, తిండి ఐపోచేసి హాయిగా దొబ్బి నిద్రపోయా అది డిసెంబర్ 31 వ తారీకు.

ఉదయమే జోగ్ వాటర్ ఫాల్స్ లో తడిసి ముద్దై (ప్రకృతి అందాలలో, నీళ్లలో కాదు), సందెవేళకు దావణగెరె చేరుకున్నా. జోగ్ లో ఎదో హోమ్ స్టే చూసా కానీ టైం ఉంది కదా జర్నీ లో స్పెండ్ చేద్దామని దావణగెరె రావడం జరిగింది. హోటల్ సదరన్ స్టార్ బాగానే ఉంది బస దొరికింది. డిసెంబర్ 31 ఊరంతా కోలాహలం, శాఖాహారం దొరికేలా లేదు. దావణగెరె అంతా తిరిగి బిసిబెలి బాత్ పట్టా, కడుపు నిండా పెట్టా - న్యూ ఇయర్ లేదు వంకాయ లేదు హ్యాపీ గ హోటల్ లో పడి దొర్లి దొర్లి నిద్రపోయాబా.

అట్నుంచి మురుడేశ్వర్ వైపు దౌడు తీయించా బండిని. మురుడేశ్వర్ కు మళ్ళి జోగ్ నించి వెళ్ళాలి కానీ నేను ఆ దారి వొదిలేసి, "నా దా.రి ర.హ.దా.రి కాదు, కదా", భక్తల్ వైపు తిప్పేసా. అక్కడినించి నా ప్రయాణం అత్యంత అద్భుతంగా సాగింది. షరావతి వ్యాలీ అంట మొత్తం లోయలే, దట్టమైన అడవి, దారిలో చిన్న చిన్న గుళ్ళు, గోపురాలు, సెలయేళ్ళు, ఆనకట్ట, ఎన్నో . మొత్తం 80 కి మీ దూరం నాకు నాల్గు గంటలు పట్టింది. దారంతా అటు వైపు ఇటువైపు వాహనాలు చాలా తక్కువ కనిపించాయి. ఇలాంటి ప్రయాణం మన ఇష్టం వొచ్చినట్టు ఇష్టం వొచ్చిన చోట ఆపుకుంటూ వెళ్లడం మాత్రం ప్రతివాళ్ళు అనుభవించాల్సిందే.

భక్తల్ లో సేద తీరి మురుడేశ్వర్ వైపు సాగింది నా పయనం. మురుడేశ్వర్ ఇంకొక అద్భుతం. సాయంత్రానికి వెళ్ళాను ఆ గుడి పక్కనే ఉన్న RNS రెసిడెన్సీ లో బస దొరికింది. మూడు వైపులా అరేబియా సముద్రం వర్ణించలేనంత నయానందకరం ఆ వాతావరణం. పక్కన్నే బీచ్, ఒకటే కోలాహలం, డిసెంబర్ చలి లో కూడా ఎగిరి ఎగిరి ఈతలు కొడ్తున్నారు. ఒక చిన్న సైజు గజ ఈతగాడినే కానీ గజ గజ ఉంది కదా. (గజ ఈతగాడినంటే మరి మాది కర్నూల్ కదా. కేసీ కెనాల్, తుంగభద్రా, హంద్రీ, ఇన్ని పెట్టుకొని ఎవడన్నా ఈత రాదు అన్నాడంటే .. వొద్దులెండి ఎవరన్నా కర్నూల్ వాళ్ళు ఉన్నారంటే కొడతారు. నేను మా జతగాళ్లయితే నూరు శాతం కేసీ కెనాల్ లో అటెండన్స్ .. ఒహ 50 - 60 శాతం బడో కాలేజో అటెండన్స్ ఉండేది. రూటు మారుతున్నా కదా. ఓకే ఓకే . రాత్రిపూట వెలుగుల లో ఆ మురుడేశ్వర్ గుడి, శివుని విగ్రహం, బీచ్ అంతా విద్ద్యుత్ దీపాల అలంకరణ .. నాకు వర్ణించటం చేతనవట్లే, ఎదో పామరుణ్ణి కదా పాండిత్యం లేదు మరి, పైత్యం తప్ప.

ఆడ్నించి గోకర్ణ పోదామని చుస్తే హై వే కనిపిస్తోంది. మనకది నచ్చదు కదా. వొచ్చి రాని కనడం లో కనుక్కోడం మంచిదని "ఇల్లి దిందా గోకర్ణ హొగు బేకు ఇంగ్లిష్ కలిపి వేరే ఏదన్న దారి ఉందా" అంటే "అరేబియా సముద్రంలో హోగీ" అని ఝలక్ ఇచ్చాడు. వార్నీ అనుకోని ర.హ.దా.రే పట్టా. బోర్ అనుకున్నా కానీ దారంతా నాతోపాటు అరేబియా సముద్రం, చల్లని గాలి, అసలే డిసెంబర్ మాసం, ఐన సరే అద్దాలు దింపుకొని విలాసంగా నడుపుకుంటూ గోకర్ణ వెళ్ళా. అక్కడా బీచ్ ఉంది. బీచ్ బోర్ కొట్టినా పురాతనమైన దేవాలయం ఒక మంచి అనుభూతిలోకి తీసుకెళ్లింది. దూప దీప నైవేద్యాలైపోచేస్కోని బైల్దేరా. ఎక్కడికి .. గోవా

బొచ్చడెన్ని సార్లు చుసాలే గోవా. అయినా గోవా అలక్ నిరంజన్ ప్లేస్ కాదుగా. గోవా నేను కేవలం మజిలీ కి మాత్రమే పెట్టుకున్న. బాగా అలసిపొయ్యా సొలసి పడిపొయ్యా. పొద్దున్నే షురూ తరువాతి మజిలీ కి ప్రయాణం.

హంపి లో గైడ్ చాల బాగా చూపించాడు. వీలయితే బాదామి కి వెళ్ళండి సర్ ఇంకా బాగుంటుంది అన్నాడు. అడిగేవాడు లేడు గా... తిప్పు ఆ వైపు అని ఉరికించా. హుబ్బళ్ళి మీదుగా బాదామి చేరేసరికి బాగా అలసటయింది. దారి బాగాలేదు. అయినా భోజనం టయానికి చేరి, హంపి వాడిచ్చిన బాదామి గైడ్ కి ముందే ఫోన్ చేసి చెప్పిన కాబట్టి రెడీ గా ఉన్నాడు. బాదామి చూసుకొని, రాత్రి బస చేసి "హెరిటేజ్ ఇన్" లో, ఉదయాన్నే పట్టడక్కల్ చూపించాడు గైడ్. బాదామి, పట్టడక్కల్ లో శిల్ప కళ, నిర్మాణం, నైపుణ్యం ఆ ప్రదేశాలను ప్రపంచ లో అరుదైన వాటిగా చెప్పుకోవొచ్చనుకుంటా. పట్టడక్కల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు కూడా సంపాదించింది.

హమ్మయ్య ఇంతటితో నా తిరుగు ప్రయాణం మొదలైంది. ఇంటి ద్యాస కూడా. రాయచోటి, మహబూబ్ నగర్ మీదుగా హైదరాబాద్ 5 జనవరి కి చేరుకున్నానమ్మాట.

బస్కీల అవసరం రాలేదు, అదృష్టవశాత్తు

బిస్కట్ ప్యాకెట్లన్నీ దారిలో నన్ను లిఫ్ట్ అడిగి కారులో ఇరుక్కున్న 25 (నిజ్జంగా) మంది స్కూల్ పిల్లలకు ఇచ్చేసా

ఇంకోచోట Q లో వెళ్తున్న పిల్లలకు చాకోలెట్లు కుమ్మరించా

ఆ పిల్లల సంతోషం, దారిలో నా ప్రయాణ అనుభూతి, ఎన్నెన్నో ఇవన్నీ రాయాలంటే, అబ్బో...

ఇప్పటికుంటా...


Comments

Popular posts from this blog

🚘 The Road Beckons — A Note Before the Journey

Dream Ignites - Solo Road Trip to Leh

🌤️ Day 2 — Nagpur to Sagar